బ్యానర్: మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్, పివిపి సినిమాస్
తారాగణం: రానా దగ్గుబాటి, కెకె మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సీ, రాహుల్ సింగ్, సత్యదేవ్, ఓంపురి, భరత్ రెడ్డి తదితరులు
మాటలు: గంగరాజు గుణ్ణం
కథనం: గంగరాజు గుణ్ణం, సంకల్ప్ రెడ్డి, నిరంజన్ రెడ్డి
కూర్పు: ఏ. శ్రీకర్ ప్రసాద్
సంగీతం: కె
ఛాయాగ్రహణం: మధి
నిర్మాతలు: ప్రసాద్ వి. పొట్లూరి, అన్వేష్ రెడ్డి, ఎన్.ఎమ్. పాషా, జగన్‌మోహన్ వంచా, వెంకటరమణా రెడ్డి
దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి
విడుదల తేదీ: ఫిబ్రవరి 17, 2017
బాలీవుడ్‌లో జీవిత కథల్ని (ధోని, దంగల్), వాస్తవ ఘట్టాలని (నీరజ, ఎయిర్‌లిఫ్ట్, రుస్తుం) తెరకెక్కించడం ట్రెండ్ అయింది. ఇలాంటి వాటిని జనం కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత నావికా దళానికి చెందిన ఒక మిస్టరీని కథాంశంగా ఎంచుకున్నాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి.
భారత తూర్పు తీరంలో పాకిస్థాన్‌కి చెందిన సబ్‌మెరీన్ ఘాజీ అనుమానాస్పద రీతిలో ధ్వంసమైంది. అది ధ్వంసం కావడానికి అంతర్గత విస్పోటనం కారణమనేది పాకిస్థాన్ వెర్షన్ అయితే, భారతీయ నావికా దళమే దానిని ధ్వంసం చేసిందనేది మన వైపు కథనం. అసలేం జరిగిందనేది అంతు చిక్కని మిస్టరీ కాగా, ఘాజీ మన తూర్పు తీరంలోకి రావడం వెనుక మాత్రం భారీ కుట్రే వుందనేది భారతీయ నావికా దళం నమ్మకం. భారతీయ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ని ధ్వంసం చేయడానికి, విశాఖపట్నం పోర్టుని పేల్చివేయడానికి కుట్ర జరిగిందని ప్రచారంలో వుంది. ఘాజీ అనుమానాస్పదంగా ధ్వంసమై మునిగిపోయిన మిస్టరీ వెనుక 'అసలేం జరిగి ఉంటుంది?' అనే దానిని బేస్ చేసుకుని 'ఘాజీ' చిత్రం రూపొందింది. వాస్తవ సంఘటనకి కల్పిత కథని జోడించి చేసిన ఈ ప్రయత్నంలో కట్టి పడేసే అంశాలని నిక్షిప్తం చేయడంలొదర్శకుడుసంకల్ప్ విజయవంతమయ్యాడు.
సినిమా మాత్రం హాలీవుడ్, విదేశీ చిత్రాల తరహాలో కథకి మాత్రమే కట్టుబడింది. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా పూర్తిగా ప్లాట్ మీదే దృష్టి పెట్టింది. పూర్తి మేల్ కాస్ట్ అయిపోతుందని అనిపించడం వలనో ఏమో తాప్సీని ఎంటర్ చేసినట్టున్నారు కానీ ఆ క్యారెక్టర్ కూడా లేకుండా ఈ సినిమాని ఇంతే ఎఫెక్టివ్‌గా చూపించి ఉండొచ్చు. ఆ పాత్ర వల్ల కథకి ఒరిగిన ప్రయోజనం ఏమీ లేకపోగా, రెండు గంటల నిడివి వున్న చిత్రంలో దాదాపు తొంభై శాతం కథ సముద్ర గర్భంలో, సబ్‌మెరీన్‌లోనే నడుస్తుంది. లొకేషన్లు మారకుండా, సబ్‌మెరీన్ నుంచి బయటకి రాకుండా, శత్రువు ఎదురు పడకుండా లోపలే వుండి చేసే ఈ యుద్ధంతో కదలకుండా కూర్చోబెట్టడమనేది జోక్ కాదు.
ఏమి తీస్తున్నాననే దానిపై దర్శకుడికి పూర్తి అవగాహన వుండాలి. అతి తక్కువ పాత్రల మధ్య జరిగే సంభాషణల్లో ప్రతి మాటా విలువైనదై వుండాలి. ప్రేక్షకులకి సబ్ మెరీన్‌లో కూర్చున్న అనుభూతిని ఇస్తూనే, సినిమా అంతా ఇరుకైన ప్రదేశంలో జరుగుతోందనే భావన రాకుండా సినిమాటోగ్రాఫర్ చూసుకోవాలి. సబ్‌మెరీన్ల గురించి వినడమే తప్ప చూసి వుండని జనమే అత్యధికులున్నపుడు వారికి ఆ లోపలి వాతావరణం ఎలాగుంటుంది, అసలు సబ్‌మెరీన్‌లో జీవనం ఎలా గడుస్తుందనే దానిపై అవగాహనని ఆర్ట్ డైరెక్టర్ ఇవ్వాలి. పట్టుమని అయిదారు ముఖ్య పాత్రలు లేని కథతో, సింగిల్ లొకేషన్‌కే ఫిక్స్ అయిన దాంతో ఆడియన్స్‌ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన ఇంటెన్సిటీని మ్యూజిక్ డైరెక్టర్ తీసుకురాగలగాలి. ఏ విధంగా చూసినా అందరికీ పెద్ద సవాల్ అయిన 'ఘాజీ' చిత్రాన్ని సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దిన విధానానికి హేట్సాఫ్ చెప్పాలి.
కొన్ని కథలు ఊహించుకోవడానికి బాగుంటాయి. కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి గట్స్‌తో పాటు క్లారిటీ కావాలి. పాత్రలు తక్కువ అవడం వల్ల ఆసక్తికరమైన పాత్రచిత్రణపై దృష్టి పెట్టాలి. అన్ని పాత్రలకీ నేపథ్యం వివరించే వీలుండదు కనుక సన్నివేశాల్లోనే ఆయా పాత్రలతో కనక్ట్ అవడానికి తగ్గట్టుగా వాటిని తీర్చిదిద్దాలి. తల పండిన దర్శకులకే తలకి మించిన పని అనిపించే దానిని యువ దర్శకుడు సంకల్ప్ తలకెత్తుకున్నాడు. అందుబాటులో వున్న వనరులతోనే 'సబ్‌మెరీన్ వార్'ని కళ్లకి కట్టాడు. సబ్‌మెరీన్ ఆపరేషన్స్‌కి సంబంధించిన విషయాలని అధ్యయనం చేసాడు. తన దగ్గరున్న ఇన్‌ఫర్మేషన్‌తో కథలో డ్రామా పండించడానికి అనువుగా సన్నివేశాలని మలచుకున్నాడు. అసలు 'యాక్షన్' మొదలయ్యే వరకు పాత్రల మధ్య సంఘర్షణతో సినిమాని రసవత్తరంగా నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. కెకె మీనన్, రానా మధ్య ఏది మంచి, ఏది కాదు... ఏది రూల్, ఏది కాదు అంటూ జరిగే వాదం కట్టి పడేస్తుంది. ఇద్దరిలో ఎవరి సైడ్ తీసుకోవాలనే కన్‌ఫ్యూజన్ వీక్షకులకి కూడా కలిగించేటట్టుగా ఎవరి కోణంలో వారు క్యారెక్టర్లు రెండూ కరక్ట్ అనిపిస్తుంటాయి. దాంతో వాళ్ల మధ్య సంఘర్షణ చక్కగా కుదిరింది.
భారత సబ్‌మెరీన్ ఎస్ 21 నుంచి ఒకే ఒక్క టార్పిడో (శత్రువుల సబ్‌మెరీన్‌ని ధ్వంసం చేయడానికి వాడే మైన్‌లాంటి ఆయుధం) గమ్యం చేరుకోకపోగా, శత్రువుని అలర్ట్ చేస్తుంది. దాంతో వారి వ్యూహంలో భాగంగా ఇండియన్ సబ్‌మెరీన్ ప్రమాదానికి గురయి ఈజీ టార్గెట్ అయిపోతుంది. అలాంటి పరిస్థితిలోను రానా, తన బృందం ఏ విధంగా ఉన్న వనరులతోనే శత్రువు ఎత్తులని చిత్తు చేస్తారో, చివరిగా ఎలా వాళ్లని మట్టుబెడతారో అనేది ఉత్కంఠభరితంగా తెరకెక్కింది. సినిమా చూస్తున్నంతసేపు థియేటర్లో వున్నట్టు కాకుండా సబ్‌మెరీన్‌లోనే ఉన్న భావనని రేకెత్తించడంలో ఘాజీ బృందం పూర్తిగా విజయవంతమైంది. ప్రధాన పాత్రల్లో రానా, కెకె మీనన్ చక్కగా ఇమిడిపోయారు. ముఖ్యంగా మీనన్ నటన మెప్పిస్తుంది. 'సర్కార్' తర్వాత మళ్లీ అతనికి అంత ఎఫెక్టివ్ క్యారెక్టర్ ఇందులోనే దొరికింది. సపోర్టింగ్ రోల్స్‌లో అతుల్ కులకర్ణి, భరత్ రెడ్డి, సత్యదేవ్ (నేవీ సైనికుడి గెటప్‌కి తగ్గ లుక్ మెయింటైన్ చేయాల్సింది) తమవంతు బాధ్యత నిర్వర్తించారు.
ఇలాంటి సాహసోపేత చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు అభినందనీయులు. వీళ్లు వేసిన తొలి అడుగు ఇకపై ఇలాంటి సాహసాలు చేయడానికి ఇతర నిర్మాతలలో ధైర్యం నింపుతుంది. లిమిటెడ్ అప్పీల్ ఉన్న సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేసినా చేయకపోయినా, తెలుగు సినిమా చరిత్రలో ఘాజీకో పేజీ వుండిపోతుంది. మరుగున పడిపోయిన ఒక చరిత్ర పుటలోని సంఘటనకి తెర రూపం ఇచ్చిన ఘాజీ రెండు గంటల పాటు కట్టి పడేయడమే కాకుండా గుండెల నిండా దేశభక్తిని నింపి, చివర్లో రెపరెపలాడే మువ్వన్నెల జెండాకి మనసు తీరా సెల్యూట్ చేయిస్తుంది.
No comments:
Post a Comment